‘మనది మతరాజ్యం కాదు’

 న్యూఢిల్లీ : అన్ని మతాలూ సమానమని భారతీయ విలువలు ప్రభోదిస్తాయని, అందుకే భారత్‌ లౌకిక దేశంలా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. భారత్‌ ఎన్నడూ పాకిస్తాన్‌ వంటి మత రాజ్యం కాబోదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎన్‌సీసీ రిపబ్లిక్‌ డే క్యాంప్‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ మత ప్రాతిపదికన భారత్‌లో వివక్ష ఉండదని, అలా ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్నించారు. పొరుగు దేశం తమది మతపరమైన దేశమని(పాకిస్తాన్‌) ప్రకటించిందని భారత్‌ అలా ఎన్నడూ చేయబోదని అన్నారు.



అమెరికా సైతం మత రాజ్యమేనని, భారత్‌ మాత్రం మత పోకడలు లేని దేశమని చెబుతూ దేశం లోపల నివసించే వారంతా ఒకే కుటుంబంలో భాగమని మనం భావిస్తామని అన్నారు. ప్రపంచంలో నివసిస్తున్న వారంతా ఒకే కుటుంబమని ఆయన చెప్పుకొచ్చారు. భారత్‌ ఎప్పుడూ హిందూ లేదా సిక్కు, బౌద్ధం తమ మతమని ప్రకటించదని, అన్ని మతాల ప్రజలూ ఇక్కడ నివసిస్తారని అన్నారు. మనది వసుధైక​ కుటుంబ నినాదమని, ఈ సందేశాన్ని ఇక్కడ నుంచి యావత్‌ ప్రపంచానికి చాటాలని పిలుపు ఇచ్చారు.