ప్రధాని ‘జనతా కర్ఫ్యూ’కు సీఎం జగన్‌ సంఘీభావం

అమరావతి: కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ నెల 22న (ఆదివారం రోజున) ప్రజలందరూ జనతా కర్ఫ్యూను స్వచ్చందంగా పాటించాలని కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవ్వరూ ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పోలీసులు, వైద్య సిబ్బంది, మెడికల్‌ సర్వీసులు, అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్తు, పాలు వంటి నిత్యావసర/అత్యవసర వస్తువులు, ఎమర్జెన్సీ సర్వీసులు చేసేవారు తప్ప మిగతా ప్రజానీకం అంతా వారి ఇళ్లకే పరిమితం కావాలని సీఎం జగన్‌ కోరారు.