స్విమ్మింగ్‌పూల్‌లో మంత్రి.. మండిపడ్డ శివకుమార్‌!

బెంగళూరు: మానవాళి మనుగడకు ముప్పుగా మరణించిన కరోనా వైరస్‌(కోవిడ్‌-19)గురించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన మంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ప్రజలంతా కరోనా భయంతో విలవిల్లాడుతుంటే స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడటం నైతికంగా దిగజారిపోవడమే అని విరుచుకుపడింది. మంత్రి సుధాకర్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్‌ నేత, ట్రబుల్‌ షూటర్‌.. డికే శివకుమార్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభంలో మునిగిపోయిన వేళ.. రాష్ట్ర కరోనా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. స్విమ్మింగ్‌పూల్‌లో సమయాన్ని గడుపుతున్నారు. నైతిక విలువలకు సంబంధించిన విషయం ఇది. ఆయనే స్వయంగా రాజీనామా సమర్పించాలి. ముఖ్యమంత్రి ఆయనను కేబినెట్‌ నుంచి తొలగించాలి’’అని సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేశారు. (లాక్‌డౌన్‌: రేపు ప్రధాని మోదీ కీలక ప్రకటన)